ఎంపీ కవితకు చెక్ పెట్టేందుకు బీజేపీ దింపిన ఆ పెద్ద మనిషి ఎవరు..?

0
150

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతరు, నిజామాబాద్‌ ఎంపీ కవితకు ఎవరు చెక్‌ పెట్టాలనుకుంటున్నారు…? ఇందుకోసం వారు ఎలాంటి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు..? ఆ పెద్ద మనిషికే ఏరికోరి బాధ్యతలను ఎందుకు అప్పగించినట్టు..? ఈ స్టోరీలో తెలుసుకోండి.

కల్వకుంట్ల కవిత.. నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యురాలు.. అన్న కేటీఆర్‌ మాదిరిగానే అమెరికా నుంచి ఇండియా బాటపట్టి తెలంగాణ ఉద్యమంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించారు. తండ్రి స్థాపించిన తెలంగాణ రాష్ర్ట సమితిలో చేరకున్నా సమాంతరంగా ఓ వ్యవస్థనే నడిపారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పడానికి జాగృతి సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 2014లో నిజామాబాద్‌ లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. చట్టసభల్లో అడుగుపెట్టాలన్న తన కోరికను తీర్చుకున్నారు. ఢిల్లీలో యాక్టివ్‌గా ఉంటూనే నియోజకవర్గం అభివృద్ధి విషయంలో అంతే చురుకుగా ఉంటున్నారు.

నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో భారతీయ జనతా పార్టీకి కొంత సానుభూతి ఉంది.. క్యాడరూ ఉంది.. ఇదే అదనుగా ఈసారి నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని ఎట్టి పరిస్థితులలో చేజార్చుకోకూడదన్న గట్టి నిర్ణయానికి బీజేపీ వచ్చింది.. దేశవ్యాప్తంగా 2014 ఎన్నికల్లో పరాజయం పాలైన స్థానాలపై బీజేపీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. ప్రజలలో భావోద్వేగాలను రగిల్చి మెజారిటీ ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని భావిస్తోంది. హిందుత్వ సెంటిమెంట్‌ను ప్రచారాస్ర్తంగా వాడుకునేందుకు సున్నితమైన 200 నియోజకవర్గాలను గుర్తించింది.. ఇందుకోసం తెలంగాణలో మజ్లిస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్‌ను ఎంచుకుంది.

హైదరాబాద్‌లో పాగా వేసే బరువు బాధ్యతలను ఆ పార్టీ చీఫ్‌ అమిత్‌షా భుజానకెత్తుకున్నారు. హైదరాబాద్‌ నుంచి అమిత్‌షా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది.. ఇటీవల వాయిదా పడిన అమిత్‌షా పర్యటనకు ముందు ఈ ప్రచారం జోరుగా సాగింది.. ఇక పార్టీలో మరో కీలకమైన వ్యక్తి… గతంలో పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన నితిన్‌ గడ్కరికి నిజామాబాద్‌ బాధ్యతలను అప్పగించారు. మహారాష్ర్ట బోర్డర్‌లో ఉండే నిజామాబాద్‌తో గడ్కరికి అనుబంధం ఉంది.. నిజామాబాద్‌ వాసులతో పరిచయాలు కూడా ఉన్నాయి. 2009 ఎన్నికలలో నిజామాబాద్‌ అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎండల లక్ష్మీనారాయణ విజయం సాధించారు. మొన్నటి ఎన్నికల్లో 21.79 ఓట్ల శాతంతో మూడో స్థానం దక్కించుకున్నారు.

నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో సీరియస్‌గా ఎఫర్ట్‌ పెడితే ఫలితాలు ఉంటాయని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందట! ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలు ఉండటంతో మాజీ ఎమ్మెల్యేలను.. కొందరు ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టిందట! వారితో చర్చలు కూడా జరుపుతోందట!

తన స్థానంపై ఏకంగా బీజేపీ అగ్ర నాయకత్వమే దృష్టి సారించడంతో కవిత అలెర్టయ్యారట! నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఒక్క జగిత్యాల మినహా అన్ని అసెంబ్లీ సెగ్మంట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచారు. ఆపరేషన్ జగిత్యాల పేరుతో ఇక ఆమె జగిత్యాలను రిపేర్‌ చేసే పనిలో పడ్డారు. ఎక్కువ శాతం అక్కడే గడిపేందుకు ప్రిపేర్‌ అవుతున్నారు. ఇక మొన్న తన అన్న కేటీఆర్‌తో ఆర్మూర్‌లో భారీ సభ నిర్వహించి సక్సెస్‌ అయ్యారు. ఈ సభలోనే కేటీఆర్‌ తన సోదరి కవితను ఆకాశానికెత్తేశారు. లోక్‌సభలో టాప్‌ ఫైవ్‌ స్పీకర్‌లలో తన చెల్లెలు ఒకరని కీర్తించారు. ఈ సభ విజయవంతం కావడంతో ఈ నెల 17న జగిత్యాలలో భారీ సభను నిర్వహించే పనిలో పడ్డారు కవిత. ఎట్టి పరిస్థితులలో బీజేపీకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారట కవిత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here