చిత్ర విచిత్రమైన బిల్లు…

0
122

రిజర్వేషన్‌ బిల్లును ఇక్కడే నోటిఫై చేసి అమలు చేయొచ్చు
రాష్ట్రపతికి పంపితే ఆయన ప్రధానికి పంపుతారు
దీన్ని ప్రధాని ఏం చేస్తారో అందరికీ తెలిసిందే?
మీడియాతో కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి
ఆడ్వాణీ, జోషి, ఉమాభారతిలను శిక్షించాలని వ్యాఖ్య

హైదరాబాద్‌: ముస్లింలు, వెనకబడిన వర్గాల రిజర్వేషన్ల బిల్లులో అన్నీ చిల్లులే ఉన్నాయని.. ఇంత చిత్ర విచిత్రమైన బిల్లును ఇంత వరకు ఏ అసెంబ్లీలోనూ చూడలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌.జైపాల్‌ రెడ్డి అన్నారు. ఈ బిల్లు మృత శిశువుకు ప్రసవం చేస్తున్నట్లుగా ఉందన్నారు. ఆయన గాంధీభవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్‌ బిల్లును క్షుణ్నంగా పరిశీలించాననీ, ఇది పూర్తిగా మోసపూరితమైన, లోపభూయిష్టమైన బిల్లని వ్యాఖ్యానించారు. ముస్లింలకు అదనపు రిజర్వేషన్లు వచ్చే సంగతేమో కానీ టీఆర్‌ఎస్‌ ధోరణి వల్ల.. అమలులో ఉన్న నాలుగు శాతం కూడా పోయే ప్రమాదముందని హెచ్చరించారు.ఈ బిల్లును రాష్ట్రపతికి పంపితే ఆయన ఆమోద ముద్ర వేయరనీ, ప్రధానికి పంపుతారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ ఆ బిల్లును ఏం చేస్తారో.. అందరికీ తెలిసిందేనన్నారు. నిజానికి ఇక్కడే బిల్లును నోటిఫై చేసి అమలు చేయవచ్చునన్నారు. అయితే ఇందులోనూ తిరకాసు ఉందని చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతం దాటాయనే కారణంతో ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. బిల్లును ఢిల్లీకి పంపడం ద్వారా అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ చక్కర్లు కొడుతూ ఎటూ తేలకుండా ఉండిపోతుందన్నారు. ఇది కాలయాపన, కాలక్షేపం చేసే కుట్ర తప్ప రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చే అంశంలో కూడా ప్రభుత్వం ఆయా వర్గాల మధ్య చిచ్చుపెట్టే పని చేస్తోందన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లకు తమ పార్టీ సూత్రప్రాయంగా స్వాగతిస్తోందన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇప్పటికే చాలా ఆలస్యమైందనీ, ఇప్పటికైనా న్యాయం జరిగే రీతిలో కోర్టు స్పందించడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. సోమనాథ్‌ నుంచి మొదలైన రథ యాత్రలో ఆది నుంచి అంతం దాకా నరేంద్ర మోదీ కూడా ఉన్నా.. సీబీఐ సేకరించిన సాక్ష్యాల ప్రకారం ఆడ్వాణీ, జోషి, ఉమాభారతిలపై కేసులు పెట్టారన్నారు. వీరందిరినీ విచారించి శిక్షించాల్సిందేనని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here