న్యూఢిల్లీ: ‘సీఏఏ’ వేడి క్రమంగా దేశ సరిహద్దులు దాటుతోంది. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల హైకమిషనర్ మిచెల్ బాచెలెట్.. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. యూఎన్ హక్కుల కమిషన్ కార్యాలయం.. ఈ మేరకు జనీవాలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చింది. మరోవైపు.. ఢిల్లీ అల్లర్లలో భారత్‌ను దోషిగా చూపుతూ విమర్శలు గుప్పించిన పాకిస్థాన్, టర్కీ, ఇండోనేషియా సరసన ఇరాన్ కూ డా చేరింది. ‘భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన హింసలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇకనైనా ఇలాంటి తెలివితక్కువ చర్యలు ఆపి, పౌరుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి’ అని ఆ దేశ విదేశాంగ మంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ రెండు చర్యలనూ భారత్ తీవ్రం గా ఖండించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ అంశాలపై స్పందిస్తూ.. పౌరసత్వ సవరణ చట్టం పూర్తిగా భారత అంతర్గత విషయమని.. దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. కా గా యూఎన్ చర్య సరికాదని, ఇది కచ్చితంగా దేశ అంతర్గత విషయాల్లో ‘అనవసర జోక్యమే’నని కాంగ్రెస్ సీనియ ర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. దీనికి అవకాశం కల్పించిన మోదీ క్షమార్హుడు కాదని ట్విట్టర్లో పేర్కొన్నారు.