జీడీపీ 7 ఏళ్ల కనిష్ఠం.మూడో త్రైమాసికంలో 4.7 శాతంగా నమోదు.తయారీ రంగంలో క్షీణతే కారణం..!!

0
453

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నెమ్మదించింది. 2019 అక్టోబరు-డిసెంబరు (మూడో త్రైమాసికం)లో వృద్ధి 4.7 శాతానికి దిగజారింది. ఇది ఏడేళ్ల కనిష్ఠ స్థాయి. తయారీ రంగంలో నెలకొన్న క్షీణత జీడీపీ వృద్ధిని దెబ్బతీస్తోంది. 2018-19 ఇదేకాలంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వృద్ధి 5.6 శాతంగా ఉందని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్‌ ఓ) శుక్రవారంనాడు వెల్లడించింది. 2019 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు జీడీపీలో వృద్ధి 6.3 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి 6.3 శాతంగా ఉంది. కాగా 2019-20 మొదటి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటును 5 శాతం నుంచి 5.6 శాతానికి, రెండో త్రైమాసిక (జూలై-సెప్టెంబరు) వృద్ధి రేటును 4.5 శాతం నుంచి 5.1 శాతానికి సవరించారు. 2019-20 సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి 5 శాతంగా ఉండవచ్చని రెండో ముందస్తు అంచనాలో ఎన్‌ఎ్‌సఓ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 5 శాతంగా ఉండే అవకాశం ఉందని భారత రిజర్వు బ్యాంకు కూడా ఇంతకు ముందు అంచనా వేసింది.

ఇంతకు ముందు 2012-13 జనవరి-మార్చిలో జీడీపీ వృద్ధి 4.3 శాతంగా నమోదైంది.స్థిర ధరల (2011-12) వద్ద జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దాదాపు రూ.36.65 లక్షల కోట్లుగా ఉంది. 2018-19 మూడో త్రైమాసికంలో ఇది రూ.35 లక్షల కోట్లుగా నమోదైంది. వృద్ధి 4.7 శాతంగా ఉంది.

ప్రస్తుత ధరల వద్ద 2019-20 సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.1,34,432 ఉన్నట్టు అంచనా. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.1,26,521)తో పోల్చితే వృద్ధి 6.3 శాతంగా ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here