మూడురోజుల బాలికకు 20 కత్తిపోట్లు..!!

0
1058

  • గుజరాత్‌లో దారుణం

రాజ్‌కోట్ (గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లాలోని ఒక గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. రాజ్‌కోట్ జిల్లాలోని మహీక్-తేబాచాడా గ్రామాల మధ్య బహిరంగ ప్రదేశంలో కేవలం మూడు రోజుల వయసున్న పసికందును ఓ కుక్క నోట కరచుకొని తీసుకువెళ్లడాన్ని క్రికెట్ ఆడటానికి వచ్చిన యువకులు చూశారు. బాలిక ఏడుపు విన్న యువకులు కుక్కపై రాళ్లు రువ్వడంతో అది బాలికను వదిలేసి వెళ్లింది. బాలికను చూడగా ఆమె శరీరంపై 20 కత్తిపోటు గుర్తులున్నాయి. రక్తం స్రవిస్తుండగా ఏడుస్తున్న బాలికను యువకులు వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చారు.

మూడు రోజుల పసికందును ఎవరో చంపేందుకు 20 సార్లు కత్తితో పొడిచి, పసికందు నోటిలో మట్టి నింపి బహిరంగ నిర్జన ప్రదేశంలో వదిలివెళ్లారు. బాలిక నోటిలో మట్టి ఉండటంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటాన్ని గమనించిన వైద్యులు దాన్ని తొలగించారు. ఆడశిశువు పుట్టిన తర్వాత మూడు రోజులకే ఎవరో చంపేందుకు యత్నించారని, 20 సార్లు కత్తితో పొడిచారని వైద్యులు చెప్పారు. బాలికకు వైద్యం చేస్తున్నామని, ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని డాక్టర్ దివ్య బ్రార్ చెప్పారు. పొలీసులు రంగప్రవేశం చేసి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here