CAA, దిల్లీ హింసలపై ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి..!!

0
591

భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టం, మత హింసల పట్ల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) అధిపతి మైఖేల్ బాచ్లెట్ జెరియా ఆందోళనలు లేవనెత్తారు.

జెనీవాలో జరుగుతన్న మానవ హక్కుల మండలి 43వ సదస్సులో యూఎన్‌హెచ్ఆర్‌సీ హై కమిషనర్, ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల స్థితిగతుల గురించి, ఈ విషయంలో పురోగతి గురించి వివరించారు.

ఈ సందర్భంగా భారతదేశం విషయాన్నీ ప్రస్తావించారు. భారత్ పాలనలోని కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితి మీద, ఇటీవలి మత హింసలో మరణాల పట్ల ఆందోళన వ్యక్తంచేశారు.

అదే సమయంలో, ఐరాస మానవ హక్కుల మండలిలో పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుని భారత్ విమర్శలు ఎక్కుపెట్టింది. తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వటం పాక్ నిలిపివేయాలని, తన సొంత దేశ ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవాలని.. ప్రత్యేకించి మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణలో తన వైఫల్యాన్ని సరిచేసుకోవాలని సూచించింది.

మానవ హక్కుల గురించి ప్రవచించేముందు.. మానవ హక్కులను హరించటానికి ఉగ్రవాదం అతి పెద్ద మార్గమనే విషయాన్ని పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలని చెప్పింది.జమ్మూకశ్మీర్ గురించి లేవనెత్తుతున్న ప్రశ్నల మీద భారత ప్రతినిధి స్పందిస్తూ..”జమ్మూకశ్మీర్ భారతదేశంలో అవిభాజ్యమైన అంతర్భాగంగా ఉంది, అలాగే ఉంటుంది. పాకిస్తాన్ తన దురాశను వదులుకోవాలి” అని పేర్కొన్నారు.

భారతదేశంలో సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీయాలన్నది పాకిస్తాన్ ఉద్దేశమని కూడా భారత్ ఆరోపించింది.

సీమాంతర ఉగ్రవాదానికి గురవుతున్న అతిపెద్ద బాధిత దేశం భారతదేశమేనని చెప్పింది.

యూఎన్‌హెచ్‌సీఆర్ హై కమిషనర్ మైఖేల్ బాచెలెట్ జెరియా ప్రకటన అనంతరం భారత్ ఈ ప్రకటన చేసింది.

పౌరసత్వ సవరణ చట్టం పట్ల కొనసాగుతున్న వ్యతిరేకత గురించి కూడా బాచెలెట్ మాట్లాడారు. భారతదేశంలో అన్ని మతాలకు చెందిన వారూ ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

భారతదేశం గురించి ఆమె తన ప్రసంగంలో వ్యక్తంచేసిన ఆందోళనలు ఆమె మాటల్లోనే..!!

”జమ్మూకశ్మీర్‌లో కొంత మంది రాజకీయ నాయకులను విడిచిపెట్టినప్పటికీ, సాధారణ జనజీవనం కొన్ని అంశాల్లో సాధారణ స్థాయికి వస్తున్నట్లుప్పటికీ.. ఇంకా రాజకీయ నాయకులు, ఉద్యమకారులు సహా 800 మంది నిర్బంధంలోనే ఉన్నట్లు చెప్తున్నారు.’’

‘‘భారీ స్థాయిలో సైన్యం మోహరింపు కొనసాగుతుండటంతో స్కూళ్లు, వ్యాపారాలు, జీవనోపాధులకు అవాంతరాలు కలుగుతున్నాయి. భద్రతా బలగాలు తీవ్రస్థాయి బలప్రయోగం, ఇతర మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డాయన్న ఆరోపణలను పరిష్కరించటానికి ఎటువంటి చర్యలూ చేపట్టలేదు.’’

”భారత సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకున్న తర్వాత మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను భారత ప్రభుత్వం పాక్షికంగా పునరుద్ధరించింది. కానీ సోషల్ మీడియా వినియోగం మీద అధికారులు మితిమీరిన ఆంక్షలను విధించటం కొనసాగుతోంది.’’

‘‘భారతదేశంలో మరింత విస్తృతమైన అంశం.. డిసెంబర్‌లో ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం మరింత ఆందోళనకరం. పెద్ద సంఖ్యలో భారతీయులు, అన్ని మతాల వారూ ప్రధానంగా శాంతియుత పద్ధతుల్లో ఈ చట్టం పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తంచేశారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న దేశ లౌకికవాద సంప్రదాయానికి మద్దతు తెలిపారు.’’

‘‘ముస్లింల మీద ఇతర బృందాల దాడులు జరుగుతున్నపుడు పోలీసులు నిర్లిప్తంగా ఉన్నారన్న నివేదికల పట్ల నేను ఆందోళన చెందుతున్నాను. ఇంతకుముందు శాంతియుత నిరసనల మీద పోలీసులు బలప్రయోగం చేశారన్న వార్తలూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది ఇప్పుడు విస్తృతమైన మత దాడులుగా మారింది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 34 మంది చనిపోయారు. హింసను నిరోధించాలని రాజకీయ నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here