ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌లో వరుస సిరీస్‌లతో విశ్రాంతి లేకుండా ఆడాల్సి వస్తోందన్న ఆటగాళ్లకు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చురకంటించాడు. జాతీయ జట్టుకు ఆడుతూ అలా భావిస్తే.. ఐపీఎల్‌లాంటి లీగ్‌లకు దూరంగా ఉండాలని సూచించాడు. వరుస మ్యాచ్‌ల కారణంగా సాధన చేసేందుకు కూడా తమకు సరైన సమయం దొరకడం లేదని ఇటీవల న్యూజిలాండ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కపిల్ స్పందిస్తూ.. ‘మీరు నిజంగా అలసిపోయారని భావిస్తే ఐపీఎల్ సమయంలో విశ్రాంతి తీసుకోండి. ఆ లీగ్‌లో మీరేమీ దేశానికి ప్రాతినిథ్యం వహించడం లేదు’ అని కపిల్ హితబోధ చేశాడు.