61 ఏళ్ల మోడల్..దిమ్మతిరిగే ఫిట్‌నెస్..!!

0
838

న్యూఢిల్లీ: మోడలింగ్ ప్రపంచంలో యువతకే ప్రాధాన్యత ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మన దేశానికి చెందిన దినేష్ మోహన్ సీనియర్ ఏజ్ ఫ్యాషన్ మోడల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఇంతేకాదు యువ మోడళ్లకు మంచి పోటీ ఇస్తున్నారు. దినేష్ తన 61 ఏళ్ల వయసులో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించడం విశేషం. గుర్‌గావ్‌కు చెందిన దినేష్ జీవిత ప్రయాణం అత్యంత విచిత్రంగా సాగింది. 44 ఏళ్ల వయసు వరకూ స్థూలకాయం కారణంగా దినేష్ కూర్చొనేందుకు, నిలుచునేందుకు కూడా పలు అవస్థలు పడ్డారు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. చివరికి ఏడాది పాటు మంచానికే పరిమితం కావాల్సివచ్చింది. తన జీవితానుభవాల గురించి దినేష్ మాట్లాడుతూ ‘జీవితంలో అనేక కష్టాలు ఎదురుకావడంతో డిప్రషన్‌లోకి వెళ్లిపోయాను. 2004లో చేస్తున్న ఉద్యోగానికి బ్రేక్ ఇచ్చి సోదరి దగ్గరకు వెళ్లిపోయాను. అయితే అక్కడకు వెళ్లాక ఆరోగ్యం మరింత మందగించింది. చుట్టుపక్కలవారు నన్ను చూసి వేళాకోళం చేసేవారు. దీనికితోడు తిండి యావ పెరిగిపోయింది. అయితే ఇటువంటి పరిస్థితుల నుంచి ఎలాగైనా బయటపడాలని నిశ్చయించుకుని 2014లో జిమ్‌లో చేరాను. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేశాను. ఆహార విహారాదులలోనూ మార్పులు చేసుకున్నాను. శాకాహారిగా మారిపోయి పండ్లు, కూరగాయలు మాత్రమే తినడం ప్రారంభించాను. కేవలం 8 నెలల వ్యవధిలో ఫిట్‌గా మారిపోయాను’ అని తెలిపారు. కాగా దినేష్ ఫిట్‌నెస్ చూసిన ఫిజియోథెరపిస్ట్ అతనిని మోడలింగ్ రంగంలోకి వెళ్లాలని సూచించారు. 2016లో దినేష్ తన తొలి మోడలింగ్ అసైన్‌మెంట్ పూర్తి చేశారు. దీంతో దినేష్ మరి వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. 61 ఏళ్ల వయసులో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన దినేష్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ సినిమా ‘భారత్’లో నటించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here