ఢిల్లీలో ఉన్మాద గుంపుల నుంచి కాలనీని రక్షించేందుకు..ఒక్కటైన హిందూ, ముస్లిం, సిక్కులు..!!

0
486

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల చెలరేగిన అల్లర్లు హింసాకాండకు దారితీశాయి. ఈశాన్య ఢిల్లీలో నాలుగు రోజులపాటు కొనసాగిన ఈ అల్లర్లలో 42 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికిపైగా గాయపడ్డారు.

ఉన్మాద గుంపులు రోడ్డుపై పడి ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేశాయి. కార్లకు నిప్పులు పెట్టాయి. ఈ క్రమంలో దుండగుల నుంచి తమ కాలనీని రక్షించుకునేందుకు ఈశాన్య ఢిల్లీలోని ఓ కాలనీలో నివసించే హిందూ, ముస్లిం, సిక్కులు ఏకమయ్యారు. హింసాకాండ జరిగి నాలుగు రోజులు గడిచి పరిస్థితులు కుదుటపడుతున్న తర్వాత కూడా వారు అప్రమత్తంగానే ఉన్నారు. కాలనీ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా కాపు కాస్తున్నారు.

యమున విహార్‌లోని బి-బ్లాక్ కాలనీలో హిందువుల ఆధిపత్యం కలిగిన బహుజన్‌పురా ఉండగా, మరోవైపు ముస్లింలు అధికంగా నివసించే ఘోండా ఉంది. అల్లర్ల నేపథ్యంలో తమ కాలనీని రక్షించేందుకు వీరందరూ ఏకమయ్యారు. రాత్రంతా ఇళ్ల బయట కాపు కాసి అనుమానితులు లోనికి రాకుండా అడ్డుకున్నారు. ‘‘ఉన్మాద గుంపులు రాత్రి వేళ పెద్దపెద్దగా అరుస్తూ నినాదాలు చేసేవి. రాత్రివేళ అవి వింటుంటే భయం వేసేది. రెండు వైపుల నుంచి అరుపులు వినిపిస్తుంటే కాలనీ ప్రజలు రెండు వైపులా వెళ్లి వారిని లోనికి రాకుండా అడ్డుకునేవారు’’ అని 30 ఏళ్ల డెంటిస్ట్ అరిబ్ తెలిపారు.

కాలనీలోని ముస్లింలు.. ముస్లిం గ్రూపులతో, హిందువులు హిందూ గ్రూపులతో మాట్లాడి అటునుంచి అటే పంపించేవాళ్లమని ఆయన పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఏకమై 24 గంటలూ కాలనీకి కాపాలా కాస్తూ కాపాడుకున్నట్టు ఆయన వివరించారు. మరీ ఎక్కువ మంది కాకుండా కొద్దిమందితోనే కాపలా కాసేవారమని, చేతిలో లాఠీలు, రాడ్లు పట్టుకోకుండా జాగ్రత్త వహించామని ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ యజమాని అయిన చరణ్‌జీత్ సింగ్ తెలిపారు. కాలనీ రక్షణ దళంలో తాము కూడా ఉన్నామని శివకుమార్ అనే ప్రాపర్టీ కన్సల్టెంట్, వాసిమ్ అనే ప్రభుత్వ ఉద్యోగి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here